: దావూద్ అరెస్టుపై వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నాం: రాజ్ నాథ్
మాఫియా డాన్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీం ను పాకిస్థాన్ అరెస్టు చేసే అంశంపై భారత్ వేచి చూసే ధోరణి అవలంబిస్తోందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, దావూద్ ను అప్పగించాలని పదేపదే పాక్ ను కోరామని, అందుకే ఈసారి సహనం పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. చర్యలు త్వరలోనే ఉంటాయని వ్యాఖ్యానించారు. తాజాగా, దుబాయ్ లోని తన ముఠా సభ్యులతో ఓ ఆస్తి విషయమై దావూద్ మాట్లాడగా, ఆ ఫోన్ సంభాషణను ఓ పాశ్చాత్య నిఘా సంస్థ రికార్డు చేయడంతో అతడి ఆచూకీ లభ్యమైంది. కరాచీ శివార్లలోని క్లిఫ్టన్ ఏరియాలో దావూద్ ఉన్నట్టు సదరు నిఘా సంస్థ నిర్ధారణకు వచ్చింది. 1993లో ముంబయి పేలుళ్ల అనంతరం దావూద్ పాకిస్థాన్ కు పారిపోయాడు. అప్పటి నుంచి భారత్ కు చెందిన నిఘా సంస్థలు అతడి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు దీనిపై మాట్లాడుతూ, దావూద్ పాకిస్థాన్ లోనే ఉంటున్నాడనడానికి ఇప్పుడు బలమైన ఆధారం దొరికిందని అన్నారు. కాగా, 2013లో భారత్ కు చెందిన కమాండోల బృందం దావూద్ వేట నిమిత్తం పాకిస్థాన్ లో ప్రవేశించి దాదాపు లక్ష్యానికి చేరువైందని తెలుస్తోంది. అయితే, వారు దావూద్ ను గుర్తించి, అతడిని మట్టుబెట్టే దశలో ఆపరేషన్ నిలిపివేయాలంటూ ఆదేశాలు వచ్చాయట.