: సిరీస్ చేజారినట్టేనా? లేక అద్భుతాలు జరుగుతాయా?
స్వదేశంలో ఏ జట్టైనా బలమైనదే. ముఖ్యంగా, భారత్ జట్టు అయితే అరివీరభయంకరమైనదని క్రికెట్ పండితుల అభిప్రాయం. అలాగే, విదేశాల్లో అత్యంత చెత్త జట్టు ఏదంటే అప్పుడు కూడా భారత జట్టు పేరే వినిపిస్తుంది. గణాంకాలు చెప్పే మాట ఇది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా... ఇలా ఏ దేశమెళ్లినా టీమిండియా రాత మారడం లేదు. ఆస్ట్రేలియా పర్యటనలో రెండు టెస్టుల్లో భారత్ పేలవ ప్రదర్శనతో విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రారంభమైన మూడో టెస్టులో ఆసీస్ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించింది. రెండు రోజుల ఆటలో బ్యాటింగ్ పరంగా టీమిండియాపై ఆసీస్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. దీంతో 530 పరుగుల భారీ స్కోరు సాధించింది. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉంది. తొలి రెండు టెస్టుల్లో తమ నడ్డి విరిచిన మిచెల్ జాన్సన్ తదితరులను మూడో రోజు తొలి సెషన్ లో టీమిండియా ఎదుర్కొనాల్సి ఉంది. కాగా, ఇంత వరకు బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్ మూడో రోజు నుంచి స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉందంటున్నారు. దీంతో, టీమిండియా మరోసారి లియోన్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. తొలి రెండు టెస్టుల్లోనూ తొలి ఇన్నింగ్సుల్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన టాపార్డర్, రెండో ఇన్నింగ్సుల్లో చేతులెత్తేసింది. గత ఫలితాల విశ్లేషణ నేపథ్యంలో, తాజా టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తే తప్ప ఓటమి కోరల్లోంచి బయటపడే అవకాశం లేదు. మూడు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లను వీలైనంత తొందరగా అవుట్ చేసి, ఫాలో ఆన్ ఆడించాలనేది ఆసీస్ వ్యూహంగా కనిపిస్తోంది. మరి టీమిండియా దీనిని అడ్డుకుని అద్భుతాలు చేస్తుందా? అనేది భారత కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నానికి తేలిపోనుంది.