: బెజవాడలో ఆయుధ కర్మాగారం బట్టబయలు
తుపాకుల్లాంటి ఆయుధాలు కావాలంటే బీహార్ కో, లేక ఉత్తరప్రదేశ్ కో వెళ్లాలని అసాంఘిక శక్తులు చెబుతుంటాయని చాలా సందర్భాల్లో విన్నాం. ఇప్పుడు అంత దూరం వెళ్లి తుపాకులు కొనుక్కునే శ్రమను తగ్గించాలని భావించారు విజయవాడలోని లక్ష్మీదుర్గ ఇంజనీరింగ్ వర్క్స్ పరిశ్రమ నిర్వాహకులు. తాజాగా ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. వారం రోజుల క్రితం నెల్లూరు ప్రాంతానికి చెందిన శరత్ రెడ్డి అనే బీటెక్ విద్యార్థిని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తుండగా అతడిని పట్టుకున్నారు. అప్పటి నుంచి అతడిని విచారిస్తున్నారు. దీంతో, విజయవాడలో ఆయుధ తయారీ కర్మాగారం గుట్టురట్టైంది. ఆయుధాలకు ఎవరు ఆర్డర్ ఇస్తున్నారు? ఎంత మొత్తంలో ఆయుధాలు మావోలకు సరఫరా చేస్తున్నారు? ఎవరు తయారు చేస్తున్నారు? అనే అంశాలను శరత్ రెడ్డి నుంచి పోలీసులు రాబట్టారు. దీంతో, విజయవాడలో ఉన్న లక్ష్మీదుర్గ ఇంజనీరింగ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ప్రత్యేక బృందాలతో ఏలూరు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్కడ తుపాకుల కార్ట్రిడ్జ్ లు, బుల్లెట్లు, ఇతర ఆయుధ పరికరాలు భారీ ఎత్తున కనిపించాయి. దీంతో, పోలీసులు ఆశ్చర్యపోయారు. నగరం నడిబొడ్డున ఆయుధ పరికరాలు పెద్దఎత్తున స్వాధీనం కావడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. మధురానగర్ లో రివాల్వర్ లకు కావాల్సిన స్ప్రింగులు కొనుగోలు చేశారు. దీంతో వారిని పోలీసులు ప్రశ్నించారు. తమ వద్ద స్ప్రింగులు కొనుగోలు చేయడం వాస్తవమేనని, అయితే, అవి తుపాకులు తయారీకని తమకు తెలియదని స్ప్రింగులు అమ్మిన షాప్ యజమానులు వెల్లడించారు. దీంతో, ఆయుధాల తయారీ వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.