: లవ్ జిహాద్ కు పోటీగా భజరంగ్ దళ్ 'బహు లావో, భేటీ బచావో'


ముస్లిం యువకులు ప్రేమ పేరిట మతమార్పిళ్లకు పాల్పడడాన్ని 'లవ్ జిహాద్'గా ముద్రవేసిన సంగతి తెలిసిందే. ముస్లింలు హిందూ యువతులను ప్రేమ పేరిట వంచిస్తున్నారని పలు హిందుత్వ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా, లవ్ జిహాద్ కు ప్రతిగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) యువజన విభాగం భజరంగ్ దళ్ 'బహు లావో, భేటీ బచావో' పేరిట ఓ కార్యాచరణను తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన అమ్మాయిలను హిందూ కుటుంబాల్లోకి కోడళ్లుగా తీసుకొచ్చేందుకు ప్రోత్సాహం అందిస్తారు. ఈ కార్యక్రమంపై ఫిబ్రవరి 17 నుంచి ప్రచారం చేపట్టనున్నారు. దీనిపై భజరంగ్ దళ్ కు చెందిన ఓ సీనియర్ నేత మాట్లాడుతూ, "వారు (ముస్లింలు) మా బిడ్డలను మోసం చేస్తున్నారు. అయితే, 'బహు లావో, భేటీ బచావో' కార్యక్రమం ద్వారా ఇతర మతాలకు చెందిన అమ్మాయిలు వంచనకు గురికారు. ఎక్కడైనా, ముస్లిం అమ్మాయి కానీ, క్రిస్టియన్ అమ్మాయి కానీ, హిందూ అబ్బాయిని పెళ్లాడాలనుకుంటే వారికి మేం తప్పక మద్దతిస్తాం" అని వివరించారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ చేపట్టేందుకు భజరంగ్ దళ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

  • Loading...

More Telugu News