: సీఎంను కలవనిస్తలేరు... మరేంజెయ్యాలె: క్యాంపు కార్యాలయం ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవనివ్వడం లేదని పేర్కొంటూ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా నాచారంకు చెందిన నాగరాజు అనే యువకుడు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నాడు. సీఎంను కలవాలని సెక్యూరిటీ సిబ్బందిని అడిగాడు. అపాయింట్ మెంట్ ఉందా? అని వారు ప్రశ్నించారు. తాను టీఆర్ఎస్ నేతనని, గత పదకొండేళ్లుగా కాప్రా డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడినని సెక్యూరిటీ సిబ్బందికి నాగరాజు చెప్పాడు. అయినప్పటికీ వారు అతనిని అనుమతించకపోవడంతో అతడు మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. సకాలంలో సెక్యూరిటీ సిబ్బంది గమనించి అతనిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాప్రా డివిజన్ లోని సమస్యలు ముఖ్యమంత్రికి విన్నవించడానికి వస్తే తనను లోనికి అనుమతించడం లేదని నాగరాజు ఆరోపించాడు. దీంతో, అతనిని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News