: ఆర్టికల్ 370, ఏఎఫ్ఎస్పీఏపై బీజేపీ హామీ కోరుతున్న పీడీపీ


జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి నేడు కూడా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 25 సీట్లతో రెండవ స్థానంలో ఉన్న బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న పీడీపీ రెండు విషయాలపై స్పష్టత కోరుతోంది. జమ్మూకాశ్మీర్ కు దేశంలో ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని పరిరక్షించడం, రాష్ట్రంలో సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించడం వంటి పలు అంశాలపై తమకు హామీ ఇవ్వాలని బీజేపీని అడుగుతోంది. పీడీపీ అధికార ప్రతినిధి నయీమ్ అక్తర్ శ్రీనగర్ లో మీడియాతో మాట్లాడుతూ, "అన్ని అవకాశాలు ఇంకా తెరిచే ఉన్నాయి. వేరే పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు" అని చెప్పారు. 28 సీట్లు గెల్చుకుని అతిపెద్ద పార్టీగా ఏర్పడిన పీడీపీ బీజేపీతో పాటు అన్ని పార్టీలతోను చర్చలు జరుపుతోందన్నారు. తమ ఎజెండాలో కొన్ని కీలక అంశాలున్నాయని, తమ కూటమి భాగస్వామి ఎవరైనా అందులోని అంశాలపై కచ్చితమైన హామీ ఇవ్వాల్సి ఉంటుందని నయీమ్ స్పష్టం చేశారు. ఒకవేళ రొటేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రి పదవి కావాలని భవిష్యత్ సంకీర్ణ పార్టీ డిమాండ్ చేస్తే పరిశీలిస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ, ఏ పార్టీతోనూ ఇంకా చర్చలు ఆ దశకు చేరుకోలేదన్నారు.

  • Loading...

More Telugu News