: మూడో రోజు మురిపిస్తారా?... టీమిండియా స్కోరు 108/1
మెల్బోర్న్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట చివరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 108 పరుగులు చేసింది. ఓపెనర్ ధావన్ 28 పరుగులు చేసి హ్యారిస్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ విజయ్ (55 బ్యాటింగ్), పుజారా (25 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరూ రెండో వికెట్ కు అజేయంగా 53 పరుగులు జోడించడంతో భారత్ స్కోరు వంద మార్కు దాటింది. అంతకుముందు, ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 530 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (192) మరోసారి టీమిండియా బౌలర్లకు తన ఫామ్ ను రుచిచూపాడు. డబుల్ సెంచరీకి 8 పరుగుల దూరంలో అవుటైనా, జట్టుకు మాత్రం భారీ స్కోరు సాధించిపెట్టాడు. స్మిత్ కు తోడు లోయరార్డర్ లో హ్యారిస్ (74), జాన్సన్ (28) రాణించడంతో ఆసీస్ 500 మార్కు అధిగమించింది. భారత బౌలర్లలో షమి 4 వికెట్లు తీయగా, ఉమేశ్ యాదవ్, అశ్విన్ చెరో 3 వికెట్లు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 422 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో 9 వికెట్లుండగా, మూడో రోజు ఆట కీలకం కానుంది. బ్యాట్స్ మెన్ విశేషంగా రాణిస్తేనే మ్యాచ్ పై భారత్ పట్టుబిగించగలుగుతుంది. రెండో రోజు ఆటలో కనబరిచిన పట్టుదలను విజయ్, పుజారా రేపు కూడా ప్రదర్శిస్తే భారీ స్కోరు అసాధ్యమేమీ కాదు.