: 7 గంటల ప్రయాణానికి 3 రోజులు... ఆ విమానమెక్కిన ప్రయాణికుల నరకయాతన!
క్రిస్మస్ సెలవులను కుటుంబ సభ్యులతో గడపాలని గంపెడాశతో ఆ విమానమెక్కిన వారికి నరకం కనిపించింది. వివరాల్లోకి వెళితే... ఇటలీలోని మిలన్ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన ఓ ఫ్లైట్ న్యూఢిల్లీకి 259 మందితో ఒక రోజు లేటుగా బయలుదేరింది. ఈ నెల 23న తెల్లవారుజామున 2:50కి బయలుదేరాల్సిన విమానం వాతావరణం అనుకూలించక మరుసటిరోజు అర్థరాత్రి 12:30కి కదిలింది. సరేలే, ఒక రోజు ఆలస్యమైనా, మరో 7 గంటల తరువాత దిగి ఇంటికి వెళ్తామన్న ఆనందంలో అందరూ అలసటను మరచిపోయారు. ఢిల్లీ చేరుకున్న విమానం పొగమంచు కారణంగా కిందకు దిగలేక 24 మధ్యాహ్నం 12:30కి ముంబైలో దిగింది. రాత్రి 8 గంటలకు వారికి ఒక విమానాన్ని కేటాయించగా, పైలెట్లు లేక రాత్రి 9:30కి కదిలి ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లి మరోసారి వెనక్కు వచ్చింది. మరో 10 గంటల నిరీక్షణ అనంతరం క్రిస్మస్ పండుగనాడు ఉదయం 11:30కి బయలుదేరి మధ్యాహ్నం 1:30కి ఢిల్లీ చేరారు ప్రయాణికులు. దీంతో, మొత్తం 10 రోజుల సెలవులో నాలుగు రోజులు తాము కోల్పోయామని ఇటలీలో ఉద్యోగం చేస్తున్నవారు వాపోయారు.