: ప్రధాని పిలుపుకు స్పందించిన ముంబై డబ్బావాలాలు


ప్రతిష్ఠాత్మక 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొనాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు ముంబై డబ్బావాలాలు స్పందించారు. ఈ మేరకు వారు చీపుర్లు పట్టి దక్షిణ ముంబైలోని లోయర్ పరేల్ రైల్వే స్టేషన్ పరిసరాలను శుభ్రం చేశారు. దీనిపై నూతన్ ముంబై టిఫిన్ బాక్స్ సప్లయర్స్ ట్రస్ట్ (ఎన్ఎంటీబీఎస్టీ) ప్రతినిధి సుభాష్ తాలేకర్ మాట్లాడుతూ, 'స్వచ్ఛ భారత్' కార్యక్రమానికి ప్రధాని తమను నామినేట్ చేయడం పట్ల థ్రిల్లయ్యామని, అదే సమయంలో, తమకు లభించిన గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ బాధ్యతను విస్మరిస్తే, ఎన్నటికీ భారత్ ఓ పరిశుభ్రమైన దేశం కాబోదని అన్నారు. ప్రతి ఒక్కరు 15 నిమిషాలు ఈ కార్యక్రమానికి కేటాయించాలని కోరుతున్నామని తాలేకర్ పేర్కొన్నారు. తాము ప్రతి రోజు 'స్వచ్ఛ భారత్' అమలుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు తన నియోజకవర్గం వారణాసిలో 'స్వచ్ఛ భారత్' చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ముంబై డబ్బావాలాలతో పాటు, క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు తదితరులను నామినేట్ చేశారు.

  • Loading...

More Telugu News