: 'పీకే' చిత్రం అద్భుతమంటూ ఎల్ కే అద్వానీ ప్రశంసలు
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న 'పీకే' చిత్రంపై బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ఈ సినిమాను చూసిన ఆయన, అద్భుతం, ధైర్యవంతమైన చిత్రం అని పేర్కొన్నారు. తనకు 'పీకే' చాలా బాగా నచ్చిందని, మెజారీటి ప్రజలు తప్పకుండా చూడాలని ఓ ప్రకటనలో కోరారు. "ధైర్యవంతంగా అద్భుతమైన చిత్రాన్ని రూపొందించినందుకు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, నిర్మాత విధు వినోద్ చోప్రాకు నా హృదయపూర్వకమైన అభినందనలు. భారత్ వంటి విశాలమైన, వర్ణశోభితమైన దేశంలో పుట్టినందుకు మనం అదృష్టవంతులం. కులం లేదా వర్ణం, భాష, ప్రాంతం, మతం వంటివేవీ దేశ సమైక్యతను బలహీనపరచలేవన్న విషయాన్ని ఈ చిత్రం అద్భుతంగా చూపింది. మతమనేది మన దేశంలో ఆధ్యాత్మికతకు సంబందించిన వనరు. నైతిక ప్రవర్తనకు సంబంధించింది. ప్రతి మతం కూడా దేశ సమైక్యతకు తోడ్పడుతుంది" అని అద్వానీ పేర్కొన్నారు. ప్రధాన పాత్రధారులు అమీర్ ఖాన్, అనుష్క శర్మ, బొమన్ ఇరానీలు అద్భుతంగా నటించిన 'పీకే' చిత్రం చెప్పిన ప్రాథమిక పాఠం అదేనన్నారు.