: నేనూ మనిషినే... యంత్రాన్ని కాదు: సైనా
రియో ఒలింపిక్స్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న భారత సూపర్ షట్లర్ సైనా నెహ్వాల్ తిరువనంతపురంలో ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొంది. ఒలింపిక్స్ నేపథ్యంలో తన సన్నాహాలపై మాట్లాడుతూ, తాను యంత్రాన్ని కానని, మానవమాత్రురాలినేనని పేర్కొంది. ఏడాదికి 12 నుంచి 15 టోర్నీలు ఆడగలనని, అయితే, వచ్చే ఏడాది కొన్ని జాతీయ టోర్నీల్లో పాల్గొనడం లేదని తెలిపింది. కేరళలో జరిగే జాతీయ క్రీడల్లోనూ, విజయవాడలో జరిగే నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లోనూ ఆడడంలేదని వెల్లడించింది. తన శరీరం సహకరించిన మేరకే ఆడగలనని వివరించిందీ హైదరాబాదీ. ప్రస్తుతం తన దృష్టంతా వచ్చే ఏడాది ఆగస్టులో జరిగే వరల్డ్ చాంపియన్ షిప్, ఆ తర్వాత జరిగే ఒలింపిక్స్ పైనే ఉందని సైనా చెప్పింది. ఆ భారీ ఈవెంట్లు జరిగే సమయానికి ఫిట్ గా ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే ఎంపిక చేసుకున్న టోర్నీల్లోనే ఆడాలని నిర్ణయించుకున్నానని ఈ వరల్డ్ నెంబర్.4 తెలిపింది.