: భారత సైన్యంలో పని చేసిన పాకిస్థానీ...ఇప్పుడు ఫించను కూడా పొందుతున్నాడు


భారత సైన్యంలో గ్రెనేడియర్ గా 2000వ సంవత్సరంలో పదవీ విరమణ చేసి సుమారు 14 ఏళ్లుగా పింఛను పొందుతున్న పాకిస్థానీ పాస్ పోర్టు కలిగిన మహ్మద్ ఫరూక్ వ్యవహారం సంచలనం రేపుతోంది. దీంతో కేంద్ర హోం శాఖ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది. వివరాల్లోకి వెళితే... పాకిస్థాన్ కి చెందిన యూనస్, ఖయాంఖనీ దంపతుల కుమారుడు ఫరూఖ్. భర్తతో గొడవ పడిన ఫరూఖ్ తల్లి అతనికి ఏడాది వయసుండగా 1960లో సరిహద్దులు దాటి రాజస్థాన్ లోని హమీర్ కబాన్ గ్రామంలో స్థానికుడు అక్బర్ అలీతో స్థిరపడింది. 1980లో స్థానికంగా జరిగిన సైనిక నియామకాల్లో ఫరూక్ ఎంపికయ్యాడు. ఆయన ఏడాది వయసుకే రాజస్థాన్ వచ్చేయడంతో అతను అక్బర్ అలీని తండ్రిగా పేర్కొంటూ ధ్రువపత్రాలు అధికారులకు సమర్పించాడు. దీంతో అతనికి ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. 1990లో భారతీయతకు సంబంధించిన నిబంధనలు కఠినతరం చేయడంతో ఫరూక్ భయపడ్డాడు. దీంతో పాకిస్థాన్ లో ఉంటున్న మేనమామల సాయంతో పాకిస్థాన్ లోని బహావల్ పూర్ లో మెట్రిక్ చదువుకున్నట్టు నకిలీ సర్టిఫికేట్ సంపాదించి, పాస్ పోర్టు కూడా పొందాడు. వీసాను సైతం తీసుకుని ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకుంటున్నాడు. అతని తండ్రిగా పేర్కొన్న అక్బర్ అలీ ఆస్తి పంపకం విషయంలో వచ్చిన తేడాలతో ఫరూక్ పాకిస్థాన్ కోణం బట్టబయలైంది. ఫరూక్ కు భారత అధికారులు జారీ చేసిన రేషన్ కార్డు, నివాస ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ, పాక్ పాస్ పోర్టు, వీసా ఎందుకు తీసుకున్నాడన్న అంశంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ, తాను పాకిస్థానీనన్న విషయం ఫరూక్ కు లోలోపల స్పష్టంగా తెలుసని, అది రట్టైతే కనుక తిరిగి పాక్ వెళ్లిపోయేందుకు పాస్ పోర్టు ఉపయోగపడుతుందని అతను ఆలోచించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News