: చలి మంటల్లో పేలుడు...హైదరాబాదులో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు
హైదరాబాదులోని పహాడీ షరీఫ్ పరిసర ప్రాంతం వెంకటాపురంలో నేటి ఉదయం పేలుడు సంభవించింది. చలి నుంచి ఉపశమనం పొందేందుకు చలి మంటలు వేసుకున్న ఇద్దరు బాలురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సందర్భంగా సంభవించిన పేలుడులో గాయపడ్డ బాలురను స్థానికులు హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి తీవ్ర గాయాలైన బాలుర పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చలి మంటలకు బాలురు సేకరించిన చెత్తలో పేలుడు పదార్థాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పేలుడుకు దారి తీసిన కారణాలను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు.