: స్విమ్మింగ్ పూల్ నుంచి సినిమాహాల్ దాకా... ఆ విమానమే ఒక రాజ భవనం!
మామూలుగా చూస్తే అది ఎయిర్ బస్ ఏ380 మోడల్ విమానం. లోపలికి వెళ్లి చూస్తే అది నిజంగా రాజభవనమే. ఎందుకంటే, అది సౌదీ అరేబియా యువరాజు అల్ వలీద్ బిన్ తలాల్ కొనుక్కున్నాడు కాబట్టి. 300 మిలియన్ డాలర్లు (సుమారు రూ.190 కోట్లు) వెచ్చించి విమానాన్ని కొనుగోలు చేసిన ఆయన మరో 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ.126 కోట్లు) పెట్టి దాన్ని విలాసవంత సౌకర్యాలతో నింపాడు. 14 సీట్ల డైనింగ్ హాల్, స్విమ్మింగ్ పూల్, సినిమాహాల్ తో పాటు రాజ దర్బారు, పడకగది... ఇలా చెప్పుకుంటూ పోతే ఆ విమానంలోని విశేషాలు చాలానే ఉన్నాయి. విమానం మొత్తాన్ని మార్బుల్ టైల్స్ తో నింపిన యువరాజు ఒక గదికి 'మ్యాజిక్ కార్పెట్' అని పేరు పెట్టాడు. ఈ గదిలో కాళ్ళ కింద ఓ అతిపెద్ద ఫ్లాట్ స్క్రీన్ టీవీ ఉంటుంది. ఈ విమానంలోని ప్రార్థనా గది విమానం ఏ దిశగా వెళ్తున్నా, ఎల్లప్పుడూ మక్కా వైపే ఉండేలా రొటేటింగ్ విధానంలో తయారు చేశారు. అంతే కాకుండా లిఫ్ట్, గెస్ట్ ల కోసం ప్రత్యేక గదులు వంటి సదుపాయాలూ ఉన్నాయి. కాగా, ప్రస్తుతం ఈ యువరాజు ఆస్తి 18 బిలియన్ డాలర్లు (సుమారు 1.14 లక్షల కోట్లు)గా ఉంది.