: హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నామా?: కేడర్ కు కాంగ్రెస్ ప్రశ్న
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ అంతర్మథనంలో పడింది. ఏడు నెలలు గడిచిన తర్వాత గాని అసలు ఓటమికి కారణాలేంటనే విషయంపై ఆ పార్టీ దృష్టి సారించలేకపోయింది. హిందుత్వ వాదిగా ముద్ర పడ్డ బీజేపీ, ఎన్నికల్లో అదే నినాదంతో ముందుకెళ్లింది. ఘన విజయం సాధించింది. దీంతో హిందూ వ్యతిరేక విధానాలేమైనా అవలంబిస్తున్నామా? అన్న అనుమానం ఆ పార్టీ అధినాయకత్వంలో మొలకెత్తింది. అనుమానం వచ్చిందే తడవుగా దానిని నివృత్తి చేసుకునేందుకు చర్యలు ప్రారంభించింది. ‘‘మనమేమైనా హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నామా?’’ అంటూ కేడర్ ను అడిగేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతేకాక మైనారిటీల తరఫున వకాల్తా పుచ్చకున్నామా? అన్న ప్రశ్నను కూడా ఆ పార్టీ తన కేడర్ కు సంధించనుంది. దీనిపై అన్ని రాష్ట్రాల్లో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించాలని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అభిప్రాయసేకరణలోనూ సాదాసీదాగా కాకుండా మెజారిటీ కార్యకర్తల మనోభావాలను వెలికితీయాలని కూడా ఆయన దిశానిర్దేశం చేశారట. మరి రాహుల్ ప్రశ్నలకు ఆ పార్టీ కార్యకర్తలు ఏ విధమైన సమాధానాలు ఇస్తారో చూద్దాం.