: డెబిట్ కార్డ్ లేకున్నా ఏటీఎం నుంచి నగదు... ఎలాగంటే...!
మీరు ఎప్పుడైనా బ్యాంకు ఖాతా లేని మిత్రుడికో, బంధువుకో డబ్బు పంపారా? అసలు అలా వీలవుతుందా అని సందేహమా? విస్తరిస్తున్న సాంకేతికత పుణ్యమాని ఎటువంటి కార్డు లేకున్నా ఏటీఎం నుంచి నగదు పొందే సదుపాయం దగ్గరైంది. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. అది ఎలాగంటే... ముందుగా డబ్బు పంపేవారు మొబైల్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ విధానం ద్వారా లబ్దిదారుల పేరు, చిరునామా, సెల్ ఫోన్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకోవాలి. ఒకసారి బ్యాంకు నుంచి రిజిస్టర్ అయిపోయినట్టు సమాచారం వస్తే డబ్బు పంపడం చాలా సులువు. ముందుగా రిజిస్టర్ చేసుకున్న వ్యక్తికి డబ్బు బట్వాడా చేయగానే ఖాతాదారు మొబైల్ కు ఒక కోడ్ నెంబర్, సదరు వ్యక్తికి మరో కోడ్ నెంబర్ ను బ్యాంకు పంపుతుంది. ఖాతాదారు తనకు వచ్చిన కోడ్ ను డబ్బు తీసుకునేవారికి పంపాల్సి ఉంటుంది. ఆపై 'కార్డ్ లెస్ కాష్ ఎనేబుల్డ్' ఏటీఎం కేంద్రానికి వెళ్లి, ఆప్షన్ ఎంచుకొని రెండు కోడ్ నెంబర్ లను, మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేస్తే ఖాతాదారు ఎంత మొత్తం పంపిస్తే అంత కాష్ చేతికి వస్తుంది. ఇందుకోసం ఒక్కో లావాదేవీకి బ్యాంకు రూ.25 వరకు వసూలు చేస్తుంది. ఒకసారి డబ్బు ట్రాన్స్ఫర్ అయిన తరువాత కోడ్ నెంబర్ లు 14 రోజులు చెల్లుబాటులో ఉంటాయి. 14 రోజుల లోపల లబ్దిదారు డబ్బు విత్ డ్రా చేసుకోకుంటే, ఆ మొత్తం తిరిగి ఖాతాదారు ఎకౌంటులో కలుస్తుంది. ప్రస్తుతానికి రూ.5 వేలు లేదా రూ.10 వేల మొత్తాలను బ్యాంకులు స్వీకరిస్తున్నాయి. నెలకు రూ.25 వేలకు మించకుండా డెబిట్ కార్డులు లేని మనవారికి డబ్బు ఈ విధంగా పంపవచ్చు. ఐసీఐసీఐ సహా పలు బ్యాంకులు ఇప్పటికే ఈ సేవలను ప్రారంభించాయి. కొన్ని బ్యాంకుల ఏటీఎంలలో ప్రత్యేక బటన్ సదుపాయం ఉండగా, మరికొన్ని చోట్ల 'అదర్ ఆప్షన్' విభాగంలో ఈ లావాదేవీకి అవకాశం కల్పించారు.