: జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీనే కీలకం: అరుణ్ జైట్లీ
జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ పాత్రే అత్యంత కీలకమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని జమ్ములో మంత్రి స్పష్టం చేశారు. ఈ రోజు అక్కడికి వెళ్లిన ఆయన పార్టీ నేతలు, ఇంకా కొంతమందితో చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ లో ఎక్కువ శాతం ఓట్లు తమ పార్టీకే వచ్చాయన్నారు. అయితే పీడీపీకి తమకంటే కొన్ని సీట్లు ఎక్కువొచ్చినా ఓట్లు మాత్రం తమకే ఎక్కువ వచ్చాయని వివరించారు. ఇక్కడి ప్రజలు బీజేపీని ఆదరించారనేందుకు ఇదే మంచి నిదర్శనమని జైట్లీ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ లో సౌభ్రాతృత్వం, అభివృద్ధి అంశాలపై దృష్టి పెడతామని చెప్పారు.