: ఐ విల్ బీ బ్యాక్: ఓటమి తర్వాత నిలిచిపోయిన ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ అకౌంట్
ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ తాజా మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ అకౌంట్ దాదాపుగా నిలిచిపోయింది. మంగళవారం నుంచి ఆయన ట్విట్టర్ అకౌంట్ లో అప్ డేట్స్ లేవు. ‘‘కీప్ కామ్ కాజ్ ఐ విల్ బీ బ్యాక్’’ అన్న పోస్టింగ్ మాత్రమే ఆయన ట్విట్టర్ పేజీలో దర్శనమిస్తోంది. బుధవారం వచ్చిన ఈ పోస్టింగ్ స్థానంలో ఇప్పటిదాకా మరే పోస్టింగ్ దర్శనమివ్వడం లేదు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో విషమ పరిస్థితిని ముందే అంచనా వేసిన ఆయన రెండు స్థానాల నుంచి బరిలోకి దిగారు. సోనావార్, బీర్వా నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయన తొలుత సోనావార్ లో పరాజయం పాలయ్యారు. బీర్వాలోనూ ఓటమి దిశగా పయనించిన ఆయన చివరి దశలో గట్టెక్కారు. ఈ ఓటమి నేపథ్యంలోనే ఆయన తన ట్విట్టర్ ను అప్ డేట్ చేయడం మానేశారని తెలుస్తోంది.