: న్యూ ఇయర్ గిఫ్ట్... మరోసారి తగ్గనున్న పెట్రోల్ ధర!
క్రూడాయిల్ ధరలు మరోసారి పడిపోయాయి. ఈ దఫా అమెరికా మార్కెటింగ్ చేసే ముడిచమురు ధర బ్యారల్ కు 55 డాలర్లకు చేరింది. దీంతో దేశవాళి మార్కెట్లో పెట్రోల్ ధర కూడా తగ్గనుంది. ఒక వైపు క్రిస్మస్ సంబరాలు, మరోవైపు ప్రభుత్వం నుంచి లభించే పన్ను రాయితీల కోసం పెద్దఎత్తున ముడిచమురును అమ్మకానికి ఉంచడమే ధర తగ్గడానికి కారణంగా నిపుణులు వ్యాఖ్యానించారు. నిన్నటి సెషన్లో యూఎస్ క్రూడాయిల్ ధర బ్యారల్ కు 1.30 డాలర్లు పడిపోయి 55.82 డాలర్లకు చేరింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర సైతం 60 డాలర్ల దిగువకు పతనమైంది. కాగా, ఈ ప్రభావంతో జనవరి తొలి వారం నుంచి లీటర్ పెట్రోల్ ధర మరో రూ.2 వరకూ తగ్గొచ్చు. ఈ విషయమై ప్రభుత్వరంగ చమురు కంపెనీలు నెలాఖరున నిర్ణయం ప్రకటించనున్నాయి.