: ప్రధానిగా ఉన్నప్పుడు భారతరత్న వద్దన్న వాజ్ పేయి


భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గతంలోనే ఆయన భారతరత్న పురస్కారాన్ని అందుకోవాల్సింది. అయితే, వాజ్ పేయి అందుకు సుముఖత చూపించలేదు. వివరాల్లోకి వెళ్తే, వాజ్ పేయి మూడో సారి ప్రధాని అయిన సమయంలో ఆయన పేరు ప్రఖ్యాతులు మారుమోగుతున్నాయి. ఫోఖ్రాన్ అణు పరీక్షలు (1998), కార్గిల్ యుద్ధ విజయం ఆయన ఇమేజ్ ను మరింతగా పెంచాయి. ఈ నేపథ్యంలో భారతరత్నకు తన పేరును సొంతంగా నామినేట్ చేసుకోవాలని బీజేపీ సీనియర్ నేతలు వాజ్ పేయికి సూచించారు. దాన్ని వాజ్ పేయి సున్నితంగా తిరస్కరించారు. సాధారణంగా ఎవరినైనా భారతరత్న పురస్కారం కోసం ప్రధాని నామినేట్ చేస్తారు. అంతకు ముందు జవహర్ లాల్ నెహ్రూ (1955), ఇందిరాగాంధీ (1971) లు తమ సొంత పేర్లను తామే నామినేట్ చేసుకుని భారతరత్న అందుకున్నారు. ఇదే రీతిలో తనను తాను నామినేట్ చేసుకోవాలని బీజేపీ నేతలు వాజ్ పేయిని కోరారు. తనను తాను భారతరత్నకు నామినేట్ చేసుకోవడం మంచి పద్ధతి కాదని... అటల్ జీ ససేమిరా అన్నారు. దీంతో, అందరూ మిన్నకుండి పోయారు. అయితే వాజ్ పేయిని ఎలాగయినా భారతరత్నతో సత్కరించాలనే సంకల్పం బీజేపీ సీనియర్ నేతల్లో అధికమయింది. వాజ్ పేయి ఎప్పుడయినా విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు, ఆయన పేరును సైలెంట్ గా ప్రతిపాదించాలని నిర్ణయించారు. ఈ విషయం ఎలాగో వాజ్ పేయి చెవిన పడింది. దీంతో, ఆయన సీనియర్లందరితో చర్చించి... మరోసారి అలాంటి ఆలోచన చేయకుండా అడ్డుకున్నారు. అంతటి ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి వాజ్ పేయి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వాజ్ పేయిని 'లివింగ్ భారతరత్న'గా సంబోధించడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

  • Loading...

More Telugu News