: అసోంలో రక్తపాతం... ఏనుగు అంబారీపై చీఫ్ సెక్రటరీ!


ఓ వైపు రాష్ట్రంలో తీవ్రవాదులు రక్తపాతం సృష్టిస్తున్నారు. రెండు రోజుల్లోనే 72 మంది అమాయక ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదీ బోడోల దాడులతో అసోంలో తాజా పరిస్థితి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సీనియర్ పోలీసు అధికారులు సహా కీలక స్థానాల్లోని ఐఏఎస్ అధికారులు బాధితుల సహాయార్థం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అయితే అసోం చీఫ్ సెక్రటరీ జితేశ్ ఖోస్లాకు ఇవేమీ పట్టలేదు. ఎంచక్కా కుటుంబంతో కలిసి విహార యాత్రలో ఉల్లాసంగా గడుపుతున్నారు. ఎక్కడికో సుదూర ప్రాంతానికి వెళ్లారు, వచ్చేందుకు సమయం పట్టదా అనుకోకండి. ఆయనగారు పర్యటిస్తున్నది అదే రాష్ట్రంలోని కజిరంగా జాతీయ పార్కులోనే. కుటుంబంతో కలిసి విహార యాత్రకు వచ్చిన ఆయన ఏనుగు అంబారీని ఎక్కి సరదాగా గడుపుతున్న చిత్రాలను స్థానిక వార్తా చానెళ్లు ప్రసారం చేశాయి. దీంతో ఖోస్లా వైఖరిపై ఒక్కసారిగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఓ వైపు రాష్ట్రంలో రక్తపాతం జరుగుతుంటే, ప్రభుత్వానికి నాయకత్వం వహించాల్సిన పదవిలో ఉంటూ, ఈ పర్యటనలేమిటని ఆయనపై విమర్శల జడివాన కురిసింది. మరి ఆయన ఇప్పటికైనా తన పర్యటనను ముగిస్తారో, లేదో చూడాలి.

  • Loading...

More Telugu News