: సామాన్యులకు వైకుంఠ దర్శనం కలే!... తెరచుకోని టీటీడీ బుకింగ్ సైట్
తిరుమలలో వైకుంఠ ఏకాదశి మరుసటి రోజున ద్వాదశి నాడు దేవదేవుని దర్శించుకోవాలని భావించి ముందస్తు టిక్కెట్లను బుక్ చేద్దామంటే టీటీడీ బుకింగ్ సైట్ వెక్కిరిస్తోంది. మొత్తం 10 వేల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని, ఉదయం 9 గంటల నుంచి అంతర్జాలంలో వీటిని ఒక్కొక్కటి రూ.300 చొప్పున కొనుగోలు చేసుకోవచ్చని టీటీడీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉదయం 9 గంటల నుంచి ఇప్పటివరకూ www.ttdsevaonline.com తెరచుకోలేదు. ఒక్కో ద్వాదశి టిక్కెట్ కు సుమారు 1000 మంది పోటీ పడుతుండటంతో వెబ్ సైట్ సర్వర్ మొరాయించింది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న భక్తులు తీవ్ర నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖులు స్వయంగా వచ్చే పక్షంలో మాత్రమే పరిమితంగా టిక్కెట్లు విక్రయిస్తామని, వీఐపీ టిక్కెట్లు కోరుకునే ఇతరులు అంతర్జాలంలో కొనుగోలు చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించిన సంగతి తెలిసిందే.