: భర్తను వేధిస్తున్న మహిళా న్యాయమూర్తి... కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్‌లోని మియాపూర్ కోర్టులో జడ్జిగా పని చేస్తున్న శ్రీదేవి తనను వేధిస్తోందని, ఆమె తల్లిదండ్రుల నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె భర్త కె.జితేంద్ర అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫిర్యాదులోని వివరాల మేరకు అనంతపురం, సాయినగర్‌కు చెందిన జితేంద్రకు ఈ ఏడాది మార్చి 7న వివాహమైంది. పెళ్ళయిన వారం రోజుల నుంచి తన భార్యతో మనస్పర్థలు మొదలయ్యాయని, గొడవలు భరించలేక తాను అనంతపురం కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నానని జితేంద్ర చెప్పారు. ఇందులో భాగంగా నిన్న కోర్టు ముగిసిన అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటికెళ్లగా తనను బలవంతంగా ఈడ్చుకెళ్లి, తిడుతూ దాడి చేశారని, దెబ్బలకు తాళలేక తప్పించుకుని ఇంటి నుంచి నేరుగా ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నానని తెలిపారు. తనకు మెడ, ఛాతి, నుదుటి మీద దెబ్బలు తగిలాయని, తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని, రక్షణ కల్పించాలని కోరారు.