: బాలచందర్ తో అనుభవాల్ని గుర్తు చేసుకున్న తెలుగు ప్రముఖులు
ప్రముఖ సినీ దర్శకుడు కె.బాలచందర్ తో తన జ్ఞాపకాల్ని జయసుధ నెమరువేసుకున్నారు. కె. బాలచందర్ గా సుప్రసిద్ధుడైన కైలాసం బాలచందర్ గారి వద్ద తాను ఓనమాలు నేర్చుకున్నానని ఆమె తెలిపారు. బాలచందర్ స్కూల్లో చదువుకునే ఇంతటి నటిని అయ్యానని, ఆయన వద్ద భయంతో భక్తిగా ఉండేవారమని ఆమె తెలిపారు. ఆయన సినిమాను తెరకెక్కించే విధానంలో ఒక వినూత్నమైన స్టైల్ ఉండేదని ఆమె వివరించారు. నటులు సరిగా నటించకపోతే ఆయన కోపపడేవారని తెలిపిన ఆమె, కోపం, చిరునవ్వు, ప్రేమ కలగలిపితేనే బాలచందర్ అన్నారు. దర్శకుడు, కళాతపస్వి విశ్వనాధ్ మాట్లాడుతూ, ధ్రువతార రాలిపోయిందని అన్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు గ్రేటెస్ట్ షాక్ అని తెలిపారు. తమలాంటి వారికి ఆయన టెక్ట్ బుక్ లాంటి వారని అభిప్రాయపడ్డారు. వారం రోజుల పాటు ఆయన దగ్గర పనిచేస్తానని అడిగానని తెలిపిన విశ్వనాధ్, ఆయన దగ్గర పనిచేసే అవకాశం దొరకనప్పటికీ, ఆయనతో తెరపంచుకునే భాగ్యం కలిగిందని అన్నారు. జయప్రద మాట్లాడుతూ, ఆయన మరణం చిత్ర పరిశ్రమకు గొప్పలోటని అన్నారు. తనను మంచి కళాకారిణిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. ఆయనతో కలిసి పలు సినిమాలు చేశానని, తమకు మార్గదర్శకుడిగా వ్యవహరించారని పేర్కొన్నారు. తాము ఈ స్థానంలో ఉన్నామంటే ఆయనే కారణమన్నారు. మహిళల సమస్యలను తెరపై సమర్ధవంతంగా చూపేవారని ఆమె పేర్కొన్నారు.