: పీడీపీకి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ


పీడీపీకి మద్దతిచ్చేందుకు వ్యతిరేకం కాదంటూ కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. జమ్మూకాశ్మీర్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిపత్యం లభించని నేపథ్యంలో జాతీయ పార్టీలు రెండూ వ్యూహ ప్రతివ్యూహాలతో అధికారం చేజిక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో పాగా వేసేందుకు వచ్చిన సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు బీజేపీ వ్యూహాల్లో మునిగిపోయింది. జాతీయ పార్టీగా దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములతో డీలా పడింది. ఓటమి భారం నుంచి పుంజుకోవాలంటే జమ్మూ కాశ్మీర్లో అధికార పీఠం నుంచి వైదొలగకపోవడమే మేలనే అభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి వ్యూహాల్లో మునిగిపోయింది. రెండు జాతీయ పార్టీలు పీడీపీకి మద్దతిచ్చేందుకు తాము సిద్ధమంటే, తాము సిద్ధమంటూ స్నేహ హస్తం చాస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ పీడీపీతో పొత్తుకు రంగం సిద్ధం చేస్తున్నామని ప్రకటించి చర్చలు ప్రారంభించింది. గతంలో పీడీపీ మిత్రపక్షంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ తాము పీడీపీతో పొత్తుకు వ్యతిరేకం కాదంటూ రాయబారం నడుపుతోంది. దీంతో ఆధిక్యంలో నిలిచిన పీడీపీ ఎవరితో సాగాలో నిర్ణయించుకోవడంలో సంయమనం చూపుతోంది. నమ్మదగిన భాగస్వామితో పగ్గాలు చేపడతామని పీడీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఆరేళ్లు కూర్చునేందుకు సిద్ధమని ప్రకటించింది. దీంతో అధికారం చేపట్టేది పీడీపీతో పాటు బీజేపీయా? లేక కాంగ్రెస్ పార్టీయా? అనేది ఉత్కంఠ రేగుతోంది. మూడు పార్టీల మధ్య కుర్చీ ఆట సాగుతోంది. పీడీపీ, బీజేపీ అధికారం చేపడితే జమ్మూకాశ్మీర్లో తిరుగులేని ఆధిక్యంతో రెండు పార్టీలు అసెంబ్లీలో కూర్చుంటాయి. అదే పీడీపీ, కాంగ్రెస్ తో పొత్తు కడితే, ఎన్సీపీ కానీ, స్వతంత్రుల సహాయం కానీ అవసరం అవుతుంది. అలాంటి పక్షంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషిస్తుంది. దీంతో జమ్మూ కాశ్మీర్ రాజకీయం వణికించే చలిలో కూడా సెగలు రేపుతోంది.

  • Loading...

More Telugu News