: బీజేపీ కంటే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడమే సులువు: పీడీపీ ఎంపీ
జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా? నేనా? అన్నట్టు బీజేపీ, పీడీపీలు పోటీ పడుతున్నాయి. సీట్ల సంఖ్యలో పీడీపీనే ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందా? అన్న అంశంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. అయితే పోటీ ఇస్తున్న బీజేపీతో పీడీపీ కలుస్తుందని వార్తలు వస్తున్నప్పటికీ అది సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీడీపీ నేత, ఎంపీ ముజాఫర్ హుస్సేన్ బేగ్ మాట్లాడుతూ, బీజేపీ కన్నా కాంగ్రెస్ తో కలవడమే తమ పార్టీకి సులువంటున్నారు. ఎందుకంటే, కాంగ్రెస్ తో తమకు కనీస ఉమ్మడి కార్యక్రమం (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్) ఉందని, అందుకే చాలా తేలికని చెప్పారు. దానివల్ల పీడీపీ అనుభవంతో సంకీర్ణం విజయవంతమవుతుందన్నారు. అయితే ఈ కనీస ఉమ్మడి కార్యక్రమ వివరాలను వెల్లడించడానికి బేగ్ నిరాకరించారు. ఒకవేళ బీజేపీతో కలసి వెళ్లడం వల్ల జమ్ము కాశ్మీర్ కు ఉపయోగపడుతుందని ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు సూచిస్తే పరిశీలిస్తామన్నారు. ఏదేమైనా సమష్టి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని బేగ్ వెల్లడించారు.