: తిట్టుకున్న కోహ్లీ, ధావన్!


గెలుస్తున్నంత కాలం సమస్యలేవీ కనిపించవు. ఓటమి పర్వం మొదలైతే అన్నీ సమస్యలే! గాయాలు, ఫామ్ లేమి, ఆటగాళ్ల మధ్య విభేదాలు... ఇలా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. తాజాగా, ఆస్ట్రేలియా టూర్లో రెండు టెస్టుల్లో ఓటమిపాలైన వెంటనే టీమిండియా డ్రెస్సింగ్ రూంలో చోటుచేసుకున్న ఓ వాగ్వివాదం వెల్లడైంది. బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధావన్ మధ్య ఈ గొడవ జరిగింది. విషయం ఏమిటంటే... మూడో రోజు ఆటలో నాటౌట్ గా మిగిలిన శిఖర్ ధావన్ తర్వాతి రోజు ఉదయం బ్యాటింగ్ కు వెళ్లేందుకు నిరాకరించాడు. ప్రాక్టీసులో మణికట్టుకు దెబ్బ తగిలిందని మేనేజ్ మెంట్ కు తెలిపాడు. దీంతో, కోహ్లీ బరిలో దిగాల్సిన పరిస్థితి! సన్నద్ధమయ్యేందుకు కొద్ది సమయం మాత్రమే ఉండడంతో ఈ ప్రతిపాదనను కోహ్లీ వ్యతిరేకించాడు. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో బరిలో దిగి పేలవ ప్రదర్శనతో ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. పెవిలియన్ చేరుకుని ధావన్ పై అంతెత్తున ఎగిరాడు. తాను అలా అవుట్ కావడానికి ధావనే కారణమని కోహ్లీ నిందించాడట. ఓపెనింగ్ సెషన్ లో బరిలో దిగేందుకు భయపడే ధావన్ గాయాన్ని సాకుగా చూపాడని కూడా ఆరోపించాడు. అందుకు ధావన్ బదులిస్తూ, దేశం కోసం ఆడడాన్ని గర్వంగా భావిస్తానని, ఆశించిన స్థాయిలో తన ఆటతీరు లేదనుకుంటే, జట్టు నుంచి తప్పుకోవడానికి కూడా వెనుకాడబోనని స్పష్టం చేశాడు. అంతేగానీ, లేని గాయాలను ఉన్నట్టుగా చూపబోనని అన్నాడు. ఈ వివాదం చోటుచేసుకున్న సమయంలో అక్కడే ఉన్న టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాడు. కోహ్లీని కాస్త కటువుగానే హెచ్చరించినట్టు సమాచారం. ఎంత పెద్ద ఆటగాడైనా, పరిస్థితులకు అనుగుణంగా ఎప్పుడైనా బరిలో దిగాల్సి ఉంటుందని శాస్త్రి స్పష్టం చేశాడట.

  • Loading...

More Telugu News