: గోరంట్లది తప్పే... రోజా కూడా గట్టిగానే దూషించింది... అందుకే క్షమాపణకు పట్టుబట్టని వైకాపా!
నిన్నటి అసెంబ్లీ సెషన్లో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైకాపా సభ్యురాలు రోజాను 'లేడీ విలన్'గా అభివర్ణించిన తరువాత పెద్దఎత్తున గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తొలుత గోరంట్ల క్షమాపణ చెప్పాలని పట్టుబట్టిన వై.ఎస్.జగన్ చివరకు టీడీపీకి "దేవుడే బుద్ధి చెబుతాడు" అని విమర్శించి తదుపరి చర్చకు వెళ్ళిపోయారు. అసలు నిజంగా గోరంట్లది తప్పే అయితే విపక్ష పార్టీ అంత తేలికగా వదలి ఉండేదా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాస్తవానికి రోజాపై గోరంట్ల వ్యాఖ్యలు అభ్యంతరకరమే. కానీ, ఆ వెంటనే రోజా ఒక్కసారిగా ఉగ్రురాలై, చౌదరిపై దూసుకు వెళ్లడమే కాకుండా నోటికి వచ్చినట్లు దూషించారని పక్కన ఉన్న టీడీపీ సభ్యులు బయటకు వచ్చిన తరువాత గుసగుసలాడుకున్నారు. అందువల్లే సభలో రికార్డులు పరిశీలించి, వీడియో చూద్దామని టీడీపీ ప్రతిపాదించిందని, వీడియో చూస్తే అసలు విషయం బయటపడుతుందని వైకాపా దాటవేత ధోరణిలోకి వెళ్లిందని అసెంబ్లీ వర్గాలు భావిస్తున్నాయి. బుచ్చయ్య చౌదరి అభ్యంతరకరంగా మాట్లాడినప్పుడు రోజా కొంత సంయమనం పాటించి సభలో ప్రస్తావించి ఉంటే, బుచ్చయ్య చౌదరి క్షమాపణ చెప్పవలసిన పరిస్థితి ఏర్పడి, అధికార టీడీపీకి కొంత ఇబ్బందిని కలిగించేది.