: డేరా బాబా సినిమాపై నిషేధం విధించాలంటున్న సిక్కు సంఘాలు
పంజాబ్ లోని డేరా సచ్ఛా సౌధా మతాధిపతి గుర్మీత్ సింగ్ రామ్ రహీం అలియాస్ డేరా బాబాలో భిన్న కోణాలున్నాయి. శిష్యకోటికి, భక్తులకు ఉపదేశాలు చేయడమే కాదు, అప్పుడప్పుడు రాక్ స్టార్ అవతారమెత్తుతుంటారు. వేలమందిని పోగేసి ఓ కచేరీ ఇస్తారు. ఇక, తనలోని కళకు పరాకాష్టలా ఏకంగా ఓ సినిమాలో నటించారు కూడా. ఆ సినిమా పేరు 'మెసెంజర్ ఆఫ్ గాడ్'... సంక్షిప్తంగా ఎంఎస్ జీ. అంటే, దైవదూత అని అర్థం. ఈ సినిమాలో డేరా బాబానే కథానాయకుడు. సామాజిక రుగ్మతలపై ఆయన ఈ సినిమాలో పోరాడతారు. జనవరి 16న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడీ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో కొన్ని డైలాగులు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, తమను సవాల్ చేస్తున్నట్టుగా ఉన్నాయని సిక్కు సంఘాలు మండిపడుతున్నాయి. 'ఎంఎస్ జీ' విడుదల కాకుండా నిషేధం విధించాలని సిక్కు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ మాట్లాడుతూ, సినిమా విడుదల విషయం సెన్సార్ బోర్డుకు సంబంధించిన విషయమని, విడుదల విషయం వారే చూసుకుంటారని అన్నారు. ఈ సినిమాలో బాబా సరసన ఓ దక్షిణాది నటి కథానాయిక పాత్ర పోషించిందట కాగా, డేరా బాబాకు వివాదాలు కొత్త కాదు. 2007లో ఆయన సిక్కుల 10వ గురువు గురు గోబింద్ సింగ్ లా దుస్తులు ధరించడం ఘర్షణలకు కారణమైంది. సిక్కులు, డేరా మతస్థుల మధ్య ఈ విషయమై కొట్లాటలు చోటు చేసుకున్నాయి. ఆయనపై హర్యానాలో లైంగిక వేధింపుల కేసు, హత్య కేసు కూడా ఉన్నాయి.