: డీకే అరుణ ఓ కలియుగ తాటకి: జూపల్లి కౌంటర్
రాజకీయంగా అడ్డుతగులుతున్నానంటూ తనపై మంత్రి డీకే అరుణ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఎదురుదాడికి దిగారు. అరుణ ఓ కలియుగ తాటకి అంటూ వ్యాఖ్యానించారు. 'జూపల్లి.. జూలో పిల్లిలాంటి వాడు' అని నిన్న అరుణ వ్యాఖ్యానించడంపై ఈ రోజు సాయంత్రం జూపల్లి తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అధికార దాహంతో ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తోన్న అరుణ, ఆమె భర్త దందాలకు మారుపేరుగా నిలుస్తున్నారని జూపల్లి విమర్శించారు. డీకే దంపతుల చరిత్ర ఎలాంటిదో ప్రజలందరికీ తెలుసని ఆయన ఎద్దేవా చేశారు.
అరుణలా అధికార కాంక్షతో రక్తమాంసాలు తిననని ఆయన చెప్పుకొచ్చారు. ఆమెకు డబ్బు, అధికారం కావాలని.. తనకు మాత్రం తెలంగాణ, ప్రజలు కావాలని వివరించారు. అరుణను గెలిపించింది తానే అని వెల్లడించారు. తాను నిజాలు వెల్లడిస్తే అరుణ తట్టుకోలేదని కౌంటర్ విసిరారు.
అరుణపై టమేటాలు విసిరితేనే అంత కోపమొస్తే, తెలంగాణ కోసం వేలమంది ప్రాణత్యాగం చేయగా, వారి తల్లులు అనుభవిస్తున్న గర్భశోకాన్ని ఎవరు తీర్చగలరని జూపల్లి ప్రశ్నించారు. తనకు మహిళల పట్ల గౌరవం ఉంది కాబట్టే సంయమనంతో మాట్లాడుతున్నానని, తనను గాజులు తొడుక్కోవాలన్న డీకే అరుణ ఆమె భర్తకే గాజులు, చీరలు ఇవ్వాలని జూపల్లి సూచించారు. సీఎం అండతో రెచ్చిపోతున్న అరుణ వెంటనే రాజీనామా చేయాలని, తిరిగి ఆమె ఒక్క ఓటు తేడాతో గెలిచినా తాను రాజకీయ సన్యాసం చేస్తానని జూపల్లి సవాల్ విసిరారు.