: 'లఖ్వీకి బెయిల్' ను ఖండిస్తూ రాజ్యసభ తీర్మానం
ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ జకియుర్ రెహ్మాన్ లఖ్వీకి పాక్ కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని రాజ్యసభ ఈ రోజు తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు చేసిన తీర్మానానికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అంతేగాక, ఈ విషయంలో పాకిస్థాన్ ఉదాసీన వైఖరిని సభ వ్యతిరేకిస్తోందని ఛైర్మన్ హమీద్ అన్సారీ పేర్కొన్నారు. "లఖ్వీకి బెయిల్ తీర్పుపై అప్పీలు చేస్తామని చెప్పిన పాకిస్థాన్ ప్రభుత్వం, ఆ ప్రక్రియను త్వరగా చేయాలని కోరుతున్నాం. దాడి చేసిన ఏ తీవ్రవాది శిక్ష అనుభవించకుండా బయటికి వెళ్లకూడదు. ఆ దేశంలో తీవ్రవాద సంస్థల మౌలిక వ్యవస్థను వెంటనే నాశనం చేయాలి" అని తీర్మానంలో రాజ్యసభ పేర్కొంది. పెషావర్ లో ఈ నెల 16న తీవ్రవాదులు దాడులు జరిపిన రెండవరోజే పాక్ లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు లఖ్వీకి బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.