: ఐసీసీ వరల్డ్ కప్ అంబాసడర్ గా సచిన్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 2015లో జరిగే వరల్డ్ కప్ కు అంబాసడర్ గా నియమితుడయ్యాడు. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. సచిన్ వరల్డ్ కప్ కు అంబాసడర్ గా ఎంపికవడం ఇది రెండోసారి. 2011 వరల్డ్ కప్ లోనూ సచిన్ ఈ బాధ్యతలు నిర్వర్తించాడు. బాధ్యతల్లో భాగంగా, వరల్డ్ కప్ కు ప్రచారం కల్పించడంతో పాటు, టోర్నీకి సంబంధించి పలు కార్యక్రమాలకు మద్దతునివ్వాల్సి ఉంటుంది. ఈ వరల్డ్ కప్ ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో జరగుతుంది. వరల్డ్ కప్ అంబాసడర్ గా ఐసీసీ తనను ఎంపిక చేయడంపై సచిన్ మాట్లాడుతూ, వరుసగా రెండో పర్యాయం ఎంపిక కావడంతో సంతోషంగా ఉందని, దీన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. ఈ టోర్నీని 1987 నాటి వరల్డ్ కప్ తో పోల్చవచ్చని, అప్పుడు తాను బాల్ బాయ్ గా సేవలందించానని, ప్రతి బంతికీ కేరింతలు కొట్టానని పేర్కొన్నాడు. తాజా టోర్నీని సైతం అలాగే ఆస్వాదిస్తానని చెప్పాడు.