: రుణమాఫీపై మాట్లాడే హక్కు జగన్ కు లేదు: అచ్చెన్నాయుడు
రుణమాఫీపై మాట్లాడే హక్కు వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నేటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రుణమాఫీపై జరిగిన చర్చలో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్నికల నాడు చంద్రబాబు చేసిన వాగ్దానాలకు, తాజాగా అమలవుతున్న రుణమాఫీకి ఎక్కడా పొంతన లేదని ఈ సందర్భంగా జగన్ ఆరోపించారు. జగన్ ఆరోపణలపై అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. ఎన్నికల సందర్భంగా రుణమాఫీ అసాధ్యమని ప్రకటించిన జగన్ కు, రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జగన్ అవినీతి భాగోతంపైనా అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. దీంతో అధికార, విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.