: అటల్ జీకి భారతరత్న ఇవ్వాల్సిందే: అద్వానీ
భారత మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్ పేయికి భారతరత్న అవార్డు కోసం మద్దతు మరింత పెరుగుతోంది. ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ, వాజ్ పేయికి జన్మదిన కానుకగా భారతరత్నను ప్రకటించేందుకు దాదాపు రంగం సిద్ధం చేశారు. తాజాగా వాజ్ పేయికి భారతరత్న ఇవ్వాల్సిందేనని బీజేపీ వృద్ధనేత లాల్ కృష్ణ అద్వానీ కూడా గళం విప్పారు. ఓ ప్రైవేట్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా అద్వానీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘‘వాజ్ పేయి దేశానికి చేసిన సేవలకే కాక ఆయన వ్యక్తిత్వానికి గుర్తింపుగా కూడా భారతరత్నను ఇవ్వాల్సి ఉంది. అందుకు ఇది సరైన సమయం’’ అని అద్వానీ వ్యాఖ్యానించారు. వాజ్ పేయి జన్మదినాన్ని సుపరిపాలన దినంగా పరిగణించనున్నట్లు మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈ సందర్భంగా అద్వానీ స్వాగతించారు.