: ధోనీతో విభేదిస్తున్న ఆసీస్ ఆఫ్ స్పిన్నర్


ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా ఇప్పటికే రెండు టెస్టులు కోల్పోయి సిరీస్ ప్రమాదం అంచున నిలిచింది. తమ పరాజయాలకు నాసిరకం అంపైరింగ్ కూడా ఓ కారణమని కెప్టెన్ ధోనీ భావిస్తున్నాడు. మిగతా రెండు టెస్టులకు అంపైరింగ్ ప్రమాణాలు మెరుగుపడాలని ధోనీ అంటుండగా, ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ తద్విరుద్ధంగా వ్యాఖ్యానించాడు. తొలి రెండు టెస్టుల్లో అంపైరింగ్ బాగుందంటూ కితాబిచ్చాడు. జట్లు అంపైరింగ్ పట్ల ఆగ్రహం ప్రదర్శించడం సరికాదని, ఆటగాళ్లను వాగ్యుద్ధాలకు ప్రోత్సహించరాదని సూచించాడు. అంపైర్లు ఇయాన్ గౌల్డ్, మరాయిస్ ఎరాస్మస్ లకు మద్దతుగా మాట్లాడుతూ, వారు తమ బాధ్యతలను సక్రమంగానే నిర్వర్తించారని భావిస్తున్నానని లియాన్ పేర్కొన్నాడు. ముఖ్యంగా వారికి అడిలైడ్ లో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని తెలిపాడు. ఇక, డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) గురించి మాట్లాడుతూ, సిరీస్ లో ఈ విధానాన్ని ఉపయోగించేందుకు రెండు జట్లు అంగీకరించాలని చెప్పాడు. ఆటకు ఈ పద్ధతి ఎంతో మంచిదన్నాడు. ప్రస్తుత సిరీస్ లో డీఆర్ఎస్ అమల్లో ఉంటే, అడిలైడ్ టెస్టులో ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News