: వేణుకు న్యాయం జరగాలి... ఎన్ని దాడులు జరిగినా 'జబర్దస్త్' ఆగదు: నటుడు నాగబాబు
జబర్దస్త్ ప్రోంగ్రాంలో నటించి, అలరిస్తున్న నటుడు వేణుపై జరిగిన దాడిని పలువురు నటులు ఖండించారు. అంతేకాకుండా, ఘటనపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఫిలిం ఛాంబర్ నుంచి బంజారాహిల్స్ పీఎస్ వరకు జబర్దస్త్ టీం, ఇతర నటులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సినీనటుడు, జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జ్ అయిన నాగబాబు మాట్లాడుతూ, వేణుపై దాడి జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల నుంచి జబర్దస్త్ ప్రోగ్రాం కొనసాగుతోందని... ఎవరికైనా బాధ కలిగించాలని ఏ నటుడూ ప్రయత్నించడని... ఎవరైనా, హర్ట్ అయినా పోలీస్ స్టేషన్లు, కోర్టులకు వెళ్లాలి కానీ, భౌతిక దాడులకు దిగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వేణుకు న్యాయం జరిగేంత వరకు తమ నిరసనలు ఆగే ప్రసక్తే లేదని నటుడు మహర్షి రాఘవ అన్నారు. రాత్రింబవళ్లు కష్టపడుతూ, ప్రేక్షకులను అలరించడానికి తామెంతో కష్టపడుతుంటామని... మాపై దాడి చేయడం హేయమైన చర్య అని కమెడియన్ ధన్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కమెడియన్లందరం ముందుకొచ్చి తమ వంతు సాయం చేస్తుంటారని... అలాంటి కళాకారులపై దాడులు చేయడం దారుణమని చెప్పారు. దాడిలో గాయపడిన వేణు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. నటులపై దాడులు చేయాలంటూ కుల సంఘాలు చెబుతాయా? అంటూ మరో నటుడు ప్రశ్నించారు.