: బహిరంగ ప్రదేశంలో యువజంట అసభ్య ప్రవర్తన... బుద్ధి చెప్పిన ప్రజలు
థానే, ఉల్లాస్ నగర్ సమీపంలోని బద్లాపూర్ స్కై వాక్ పై తమదైన లోకంలో విహరిస్తున్న ఓ యువజంటకు అక్కడి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఆ యువజంట చెంపలు వాయిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లలో హల్ చల్ చేస్తున్నాయి. "నన్ను క్షమించండి. ఇక్కడకు మొదటిసారి వచ్చాను" అని ఆ అబ్బాయి అనటం, చుట్టుపక్కల వారు అతన్ని కొట్టడం, జంటలోని అమ్మాయికి ఓ మహిళ రెండివ్వడం వీడియోలో కనిపిస్తోంది. "మీ తల్లిదండ్రులను ఇక్కడికి పిలిచి మేము ఎందుకు కొట్టామో చెప్పండి" అని మరో వ్యక్తి అన్నట్టు తెలుస్తోంది. తాము చేసినదాన్ని వారు సమర్థించుకుంటూ, నలుగురూ తిరిగే స్థలంలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, అందుకే బుద్ది చెప్పామని వివరించారు. కాగా, యువజంటను హింసించినందుకు పోలీసులు సుమోటో కింద కేసు నమోదు చేసినట్టు తెలిసింది. మోరల్ పోలీసింగ్ పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎంతవరకూ సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు.