: పింఛన్ కోసమొచ్చిన వృద్ధురాలు మృతి... ఘటనపై విచారణకు చంద్రబాబు ఆదేశం
విజయవాడలోని చిట్టినగర్ లో నేటి ఉదయం దారుణం చోటుచేసుకుంది. పింఛన్ కోసమొచ్చిన ఓ వృద్ధురాలు తొక్కిసలాటలో మృత్యువాతపడింది. చిట్టినగర్ లోని పింఛన్ పంపిణీ కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే వృద్ధులు బారులు తీరారు. అధికారులు వచ్చి గేట్లు తెరవగానే ఒక్కసారిగా అందరూ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో కిందపడ్డ ఓ వృద్ధురాలు చనిపోయింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వృద్ధులు ఆందోళనకు దిగారు. వృద్ధుల నిరసనలతో అక్కడి రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఘటనపై సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు.