: పిల్లలకు విషమిచ్చి ప్రియుడితో కలిసి ఆత్మహత్యాయత్నం
తన ఇద్దరు పిల్లలకూ విషమిచ్చి, ప్రియుడితో కలిసి తనూ విషం తాగిందో గృహిణి. ఈ ఘటన వరంగల్ జిల్లా కురవి మండలంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. తోట పాపయ్యకు నల్గొండ జిల్లా నూతనకల్ మండలం ముకుందాపురానికి చెందిన రమ (కవిత)తో 2003లో వివాహం జరిగింది. వారికి గీతిక (4), సాయిదీప్తి (6నెలలు) కూతుళ్లు. పాపయ్య బతుకుదెరువు కోసం కుటుంబంతో హైదరాబాదులో నివాసమున్న సమయంలో కవితకు శ్రీపాల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. పాపయ్య తిరిగి స్వగ్రామం చేరినా కవిత తీరులో మార్పు రాలేదు. ఈ క్రమంలో తన ఇద్దరు పిల్లలను తీసుకుని, ప్రియుడితో కలిసి నల్గొండ జిల్లా నార్కట్ పల్లి పక్కన ఉన్న చిట్యాల గుట్టల సమీపంలోకి వెళ్లిన కవిత ఇద్దరు పిల్లలకూ విషమిచ్చి, ప్రియుడితో కలసి తానూ తాగింది. ఈ ఘటనలో పెద్ద కూతురు గీతిక అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు అపసార్మక స్థితిలో పడి ఉన్న సాయిదీప్తి, కవిత, శ్రీపాల్లను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.