: వైకాపాకు మైసూరా రెడ్డి రాంరాం?
కడప జిల్లాలోనే కాక ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కూడా సీనియర్ రాజకీయవేత్తగా ఎదిగిన మైసూరారెడ్డి వైకాపాకు క్రమంగా దూరమవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీల్లో కొనసాగిన మైసూరారెడ్డి ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న జగన్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఆయన వైకాపాలో చేరారు. పార్టీ వ్యవహారాలతో పాటు అక్రమాస్తుల కేసులోనూ ఆయన జగన్ కు పలు సలహాలు, సూచనలు చేశారు. భవిష్యత్తులో రాజ్యసభకు పంపుతామన్న జగన్ హామీతోనే మైసూరా వైకాపాలో చేరారని నాడు వార్తలు వినిపించాయి. తాజాగా ఆ పార్టీ తరఫున రాజ్యసభకు విజయసాయిరెడ్డిని ఎంపిక చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మైసూరా, త్వరలోనే జగన్ కు ఝలక్ ఇస్తారన్న వార్తలు జోరందుకున్నాయి.