: టీడీపీపై నిప్పులు చెరిగిన రోజా
వైఎస్సార్సీపీ మహిళా నేత రోజా టీడీపీపై నిప్పులు చెరిగారు. హుదూద్ తుపాను కారణంగా టీడీపీ నేతలు లాభపడ్డారని విమర్శించారు. హుదూద్ బాధితులకు 25 కేజీల బియ్యం సరఫరా చేశాం అంటూ టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. రేషన్ షాపులో కిలో రూపాయికే అందజేస్తున్నారని, అలాంటప్పుడు 25 కేజీల బియ్యం ధర ఎంత? అని ఆమె ప్రశ్నించారు. బియ్యం రేషన్ షాపుల్లోంచి సరఫరా చేయరా? అని ఆమె నిలదీశారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబునాయుడు బస్సులో వారం రోజులు ఉన్నారని టీడీపీ నేతలు గుండెలు బాదుకుంటున్నారని, ఆయన ఉన్న బస్సు ఫైవ్ స్టార్ హోటల్ లోని రూం కంటే అద్భుతంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ప్రజలకు ఏం చేశారని టీడీపీ నేతలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. హుదూద్ తుపాను విలయానికి చలించిన వేలాది మంది దాతలు చేసిన దానాలు ఏమయ్యాయని ఆమె నిలదీశారు. ఆ డబ్బు ఎక్కడికి చేరిందని ఆమె అడిగారు. విశాఖలో తుపాను ధాటికి కూలిన చెట్లను తొలగించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని ఆమె ప్రశ్నించారు. విద్యుత్ పరికరాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఇచ్చాయి. రేడియో సెట్లు ఒరిస్సా ఇచ్చింది. కార్మికులను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు సమకూర్చాయి. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందని ఆమె అడిగారు. బెంగాల్ నుంచి మమతా బెనర్జీ బంగాళాదుంపలు పంపిస్తే టీడీపీ నేతల ఇళ్లలో నిల్వ చేసుకున్నారని ఆమె విమర్శించారు. టీడీపీ నేతలు ప్రతిపక్షంపై విమర్శలు చేయడం కాదని, ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆమె సూచించారు. విశాఖ ప్రజలు తుపాను బారినపడి పేదరికంలో మగ్గిపోతుంటే... వారి పేరిట డబ్బు దండుకున్న టీడీపీ నేతలు డబ్బున్నవారుగా మారిపోయారని ఆమె విమర్శించారు.