: షరా మూమూలే... టీమిండియా భంగపడింది!
నాలుగోరోజు ఆటలో రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తారని, సాయంత్రానికి ఆసీస్ ముందు భారీ లక్ష్యం ఉంచుతారని, ఆ తర్వాత బౌలర్లు వీరవిహారం చేస్తారని ఆశించిన భారత క్రికెట్ అభిమానులకు నిరాశ తప్పలేదు! బ్రిస్బేన్ టెస్టులో టీమిండియా దారుణంగా భంగపడింది. 128 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన కంగారూలు 6 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి విజయాన్నందుకున్నారు. ఇషాంత్ శర్మ 3, ఉమేశ్ యాదవ్ 2 వికెట్లతో ప్రభావం చూపినా, లక్ష్యం తక్కువగా ఉండడంతో ఆసీస్ పని సులువైంది. ఓపెనర్ క్రిస్ రోజర్స్ 55, కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 28 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మార్ష్ 17 పరుగులు చేసి యాదవ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో గెలిచిన ఆతిథ్య జట్టు నాలుగు టెస్టుల సిరీస్ లో 2-0 ఆధిక్యం సంపాదించింది. మరొక్క టెస్టు గెలిస్తే సిరీస్ ఆసీస్ వశం అవుతుంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 26న ప్రారంభం అవుతుంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఈ మ్యాచ్ కు వేదికగా నిలవనుంది.