: పల్లెల్లో కుటుంబాల సరాసరి సంపద రూ.10 లక్షలట... ప్రభుత్వ సర్వేలో వెల్లడి
గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాల సరాసరి సంపద రూ.10.07 లక్షల స్థాయిలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారి ఆస్తుల విలువ రూ.22.85 లక్షలతో పోలిస్తే, సగం కంటే తక్కువ స్థాయిలో పల్లె కుటుంబాల ఆస్తి ఉందని ఆల్ ఇండియా డెబిట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ (ఏఐడీఐఎస్) 70వ నేషనల్ శాంపిల్ సర్వేలో వెల్లడించింది. జూన్ 30, 2012 నాటికి 98 శాతం గ్రామీణ ప్రాంత వాసులు, 94 శాతం మంది పట్టణ వాసులు స్థిరాస్తులు కలిగివున్నారని పేర్కొంది. ప్రతి వంద మందిలో 32 మంది గ్రామీణులు బ్యాంకు రుణాలు తీసుకోగా, సరాసరి ఒక్కో పల్లెవాసిపై రూ.32,522 రుణభారముంది. పట్టణాల్లో 22 శాతం మంది రుణాలు తీసుకోగా, రుణభారం సరాసరి రూ.84,625 అని ఏఐడీఐఎస్ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో 75 శాతం మందికి కనీసం ఒక హెక్టార్ భూమి కలిగివున్నట్లు సర్వే తెలిపింది.