: ఎమ్మెల్యేలు 150 కోట్లు తినేశారు...టీడీపీ గుర్తింపు రద్దుచేయాలి: రఘువీరా
హుదూద్ తుపాను సాయంలో అధికార పార్టీకి చెందిన టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ పీసీసీఛీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, తుపాను బాధితుల కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, అందులో 150 కోట్ల రూపాయలను టీడీపీ ఎమ్మెల్యేలే తినేశారని అన్నారు. దీనిపై రెండు మూడు రోజుల్లో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని అన్నారు. దీనిపై జనవరి మొదటివారంలో తమ పార్టీనేత ద్రోణంరాజు శ్రీనివాస్ ద్వారా హైకోర్టులో పిటిషన్ కూడా వేశామని ఆయన తెలిపారు. ఎన్నికల సందర్భంగా తప్పుడు హామీలిచ్చి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాస్తానని ఆయన వెల్లడించారు.