: ముందు సయీద్ ను కట్టడి చేయండి, ఆ తర్వాతే టెర్రర్ వ్యతిరేక ప్రతిజ్ఞలు: పాక్ కు శివసేన హితవు
పెషావర్ ఘటన నేపథ్యంలో టెర్రరిజంపై పోరు సాగిస్తామంటూ పాక్ చేస్తున్న ప్రకటనలపై శివసేన పార్టీ స్పందించింది. ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ ను కట్టడి చేసిన తర్వాతే టెర్రరిజాన్ని నిర్మూలిస్తామంటూ ప్రతిజ్ఞలు చేయాలని శివసేన హితవు పలికింది. తన పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేసింది. "ఈ దేశం (పాకిస్థాన్) టెర్రరిస్టు తయారీ కర్మాగారం వంటిది. పెషావర్ లో పిల్లల వధ అనంతరం హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదులు మాపై విషం కక్కుతున్నారు" అని పేర్కొంది. పెషావర్ ఘటనకు ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యత వహించాలని, భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామని హఫీజ్ ప్రకటనలు చేస్తున్నాడని, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తొలుత అతడిని అదుపు చేయాలని శివసేన సూచించింది. హఫీజ్ వంటి టెర్రరిస్టులను సమూలంగా నిర్మూలించకపోతే, అంతర్జాతీయ సమాజం పాక్ ను నమ్మదని పేర్కొంది.