: జంటనగరాల్లో ఎక్కడ చూసినా 'తలసానే'!
టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన సీనియర్ రాజకీయవేత్త తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మహర్దశ నడుస్తున్నట్టే చెప్పుకోవాలి. పార్టీ మారిన వెంటనే ఆయనను మంత్రి పదవి వరించింది. టీఆర్ఎస్ సర్కారు కేబినెట్ విస్తరణలో తలసానికి చోటు కల్పిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. తలసాని ఇప్పుడు వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ మంత్రి. మంత్రిగా ఆయనను కేబినెట్ లో తీసుకోనున్నారని వార్తలొచ్చాయో, లేదో... జంటనగరాల్లో తలసాని మేనియా మొదలైంది. ఎక్కడ చూసినా ఆయన పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలే. ఫ్లైఓవర్లు, మెట్రో పిల్లర్లు, కరెంటు స్తంభాలు... కావేవీ ప్రచారానికి అనర్హం అన్న రీతిలో తలసానికి శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్లు అంటించి, బ్యానర్లు కట్టేశారు. ఆయనకు బాగా పట్టున్న ప్రాంతాల్లో నిలువెత్తు కటౌట్లతో తమ అభిమానాన్ని చాటుకున్నారు ఛోటా లీడర్లు. ఇక, తలసాని మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ ప్రభంజనం అధికమైంది. అభిమానం పొంగిపొర్లింది. రోడ్లన్నీ గులాబీమయమయ్యాయి. సాధారణంగా నగరంలో వాణిజ్య ప్రకటనలకు కొంత స్థలం కేటాయించడం ద్వారా జీహెచ్ఎంసీ ఆదాయం పొందుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో, ఆ స్థలాన్ని కూడా తలసాని శుభాకాంక్షల ప్రకటనలు ఆక్రమించేశాయి.