: 3 వేల మంది ఉగ్రవాదులను 48 గంటల్లో ఉరి తీయండి: పాక్ ప్రధానికి ఆర్మీ చీఫ్ విజ్ఞప్తి
దేశంలోని ఉగ్రవాదులందరినీ ఉరి తీయాలని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రాహీల్ షరీఫ్, ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ కు సూచించారు. 48 గంటల్లోగా మూడు వేల మంది ఉగ్రవాదులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ ఆయన ప్రధానికి సందేశం పంపారు. ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ బెయిల్ పై విడుదలైన మరుసటి రోజే ఆయన ఈ మేరకు ప్రధానికి సందేశం పంపడం గమనార్హం. ‘‘జరిగిందేదో జరిగింది. ఇకపై ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకుందాం’’ అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. పెషావర్ ఘటనను ప్రస్తావించిన షరీఫ్ తాలిబన్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ ట్వీట్లు చేశారు. ‘‘తాలిబన్లకిదే హెచ్చరిక. మీరు మా పిల్లలను చంపేశారు. దీనికి మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదు. మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉండండి. చనిపోయిన చిన్నారుల ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం’’ అని ఆ ట్వీట్లలో షరీఫ్ తీవ్రవాదులను హెచ్చించారు.