: తొడగొట్టి, మీసం మెలేసిన శిఖర్ ధావన్


రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. ఆసీస్ తో మ్యాచ్ అంటే స్లెడ్జింగ్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది. సాధారణంగా ఇతర జట్లతో సిరీస్ అంటే ఉండే సుహృద్భావ వాతావరణం ఆసీస్ సిరీస్ లో కనిపించదు. గెలవగలమన్న జట్లపై ఆసీస్ క్రికెటర్లు నోరు పారేసుకోరు. అదే ఇంగ్లండ్, ఇండియా అంటే ఆసీస్ కు వల్లమాలిన అభిమానం! అందుకే ఈ జట్లతో పోరు అంటే సిరీస్ కంటే ముందే ఉత్కంఠను తారస్థాయికి తీసుకెళ్తారు. ఆ ఉత్కంఠను తమ ఆట, చేష్టలతో సిరీస్ ఆద్యంతమూ కొనసాగిస్తారు. తాజాగా అలాంటి సన్నివేశమే రెండో టెస్టులో అభిమానులను అలరించింది. షేన్ వాట్సన్ భారత క్రికెటర్లలో చాలా మందికి మంచి మిత్రుడు. అలాగే ఆసీస్ గడ్డపై అడుగుపెడితే ప్రతి క్రికెటర్ కీ శత్రువే. అలాంటి షేన్ వాట్సన్ లాంగ్ ఆఫ్ మీదుగా లాఫ్టెడ్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. దానిని అశ్విన్ తక్కువ బౌన్స్ అయ్యేలా సంధించడంతో అది సరిగా కనెక్ట్ కాక తక్కువ ఎత్తులో గాల్లోకి లేచింది. లాంగ్ ఆఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న శిఖర్ ధావన్ దానిని ఒడిసి పట్టుకున్నాడు. ల్యాండవుతున్న బంతిని పట్టుకున్న శిఖర్ నేలపై ఓ సారి దొర్లి, లేస్తూనే బంతిని వదిలేసి ఎడమ చేత్తో తొడగొట్టి, మీసం మెలేశాడు. ఇంతలో టీమిండియా సహచరులంతా అతనిని అభినందనల్లో ముంచెత్తారు. ఈ వీడియో ఇప్పుడు ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News