: సొంత జట్టులోనూ అగ్గిరాజేస్తున్న చాపెల్ మహాశయుడు


ఆస్ట్రేలియా జట్టుకు గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్ సోదరులు విశేష సేవలందించారు. ఆటగాళ్లుగానూ, కెప్టెన్లుగానూ వారు తమదైన ముద్రవేశారు. ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం గ్రెగ్ చాపెల్ కోచింగ్ కెరీర్ ఎంచుకుని భారత జట్టును భ్రష్టుపట్టించగా, నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తూ ఇయాన్ చాపెల్ వార్తల్లోకెక్కాడు. "నీ పనైపోయింది" అంటూ క్రికెట్ దేవుడు సచిన్ కే సలహా ఇచ్చిన ఘనత ఇయాన్ మహాశయుడి సొంతం. సచిన్ కెప్టెన్ గా పనికిరాడని, వీళ్లైతే కెప్టెన్లుగా పనికివస్తారని కొందరు ఆటగాళ్ల పేర్లు వెల్లడించి అప్పట్లో దుమారం రేపాడు. తాజాగా, తన వ్యాఖ్యలతో సొంత జట్టులోనూ అలాంటి కలకలం రేపేందుకు యత్నిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఒకవేళ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చినా, స్టీవెన్ స్మిత్ కెప్టెన్ గానే కొనసాగాలని సూచిస్తున్నాడు. గాయంతో బాధపడుతున్న క్లార్క్ జట్టులోకి వచ్చినా రాణించే అవకాశాల్లేవని ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. 2011 వరల్డ్ కప్ అనంతరం కెప్టెన్సీ కోల్పోయిన దరిమిలా రికీ పాంటింగ్ కూడా ఆటగాడిగానే తిరిగి జట్టులోకొచ్చాడని వివరించాడు. ఇప్పుడు, క్లార్క్ కూడా అలాగే చేయాలని సలహా ఇచ్చాడు.

  • Loading...

More Telugu News