: సమావేశాలను పొడిగించాలన్న వైకాపా... కుదరదన్న సర్కారు
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ఈ నెల 26 వరకు పొడిగించాలన్న వైకాపా ప్రతిపాదనను టీడీపీ సర్కారు తోసిపుచ్చింది. నేటి అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశాల పొడిగింపునకు విపక్షం పట్టుబట్టింది. కేవలం ఐదు రోజుల పాటు జరిగే సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించేందుకు అవకాశం ఎక్కడుందని విపక్షం తరపున భేటీకి హాజరైన జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్ రెడ్డి వాదించారు. అయితే, వివిధ కారణాల రీత్యా సమావేశాల పొడిగింపు ఎంతమాత్రం కుదరదని అధికారపక్షం తేల్చిచెప్పింది. సమావేశాలు జరిగినన్ని రోజుల్లోనే ప్రజా సమస్యలను ప్రస్తావించండని ప్రభుత్వం విపక్షానికి సూచించింది.